అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. యెస్ బ్యాంక్ మొండి బకాయిలను (ఎన్పీఏ) మొత్తం ఆస్తుల్లో 8 శాతంగా అంచనా వేసింది. మొండి పద్దుల సమస్యను పరిష్కరించేందుకు యెస్ బ్యాంక్ కొత్త సారథి రవ్నీత్ గిల్ ఇప్పటికే ఆస్తుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.ఈ నేపథ్యంలో బ్యాంక్ లాభాలు మరో 18 నెలలపాటు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ హెచ్చరించింది. ఆస్తుల ప్రక్షాళన కారణంగా స్వల్పకాలం పాటు ఒత్తిడికి లోనైనప్పటికీ, దీర్ఘకాలంలో బ్యాంక్‌కు సానుకూలంగా పరిణమించనుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికాని (జనవరి-మార్చి)కి యెస్ బ్యాంక్ రూ.1,506 కోట్ల నష్టం ప్రకటించింది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్కిదే తొలి నష్టం. స్థూల ఎన్పీఏలు మొత్తం ఆస్తుల్లో 3.2 శాతానికి పెరిగినట్లు శుక్రవారం విడుదల చేసిన ఆర్థిక ఫలితాల నివేదికలో బ్యాంక్ పేర్కొంది. అంతేకాదు, మరో రూ.10,000 కోట్ల విలువైన రుణాలు ఒత్తిడిలో ఉన్నాయని రవ్నీత్ గిల్ వెల్లడించారు. మొండి బకాయిల గండి పూడ్చుకునేందుకు జరిపిన కేటాయింపులు ఏడు రెట్ల మేర పెరగడంతో బ్యాంక్ నష్టాలు ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న రూ.10 వేల కోట్ల రుణాల్లో సగం మొండి పద్దుల్లోకి చేరవచ్చని బ్యాంక్ అంచనా వేస్తోందని మూడీస్ పేర్కొంది.
తొలిసారి నష్టాలను ప్రకటించటంతో యెస్ బ్యాంక్ షేరు భారీ పతనాన్ని చవిచూసింది. మంగళవారం బీఎ్‌సఈలో బ్యాంక్ షేరు ఏకంగా 29.23 శాతం క్షీణించి రూ.168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 30.37 శాతం నష్టపోయి రూ.165.30 స్థాయికి పడిపోయినప్పటికీ చివర్లో కాస్త కోలుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో కూడా యెస్ బ్యాంక్ షేరు 29.70 శాతం పడిపోయి రూ.166.75 వద్ద క్లోజైంది.రెండు ఎక్స్ఛేంజ్ల ప్రామాణిక సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. తత్ఫలితంగా బ్యాంక్ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.16,048.56 కోట్లు తగ్గి రూ.38,909.44 కోట్లకు పడిపోయింది. బీఎ్‌సఈలో 206.47 లక్షల యెస్ బ్యాంక్ షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 21 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి.