జీవితం అనే బండి నడవాలంటే ధనం కావాలి.మోటారు వాహనం నడవాలంటే ఇంధనం కావాలి.అని ప్రముఖ సినీనటుడు నాగబాబు అన్నారు.మనిషికి డబ్బే ముఖ్యం కాదని దానికి మించి మానవత్వం,వ్యక్తిత్వం లాంటివి ఉండాలని చాలా మంది చెబుతుంటారని,కానీ అవన్నీ ఉత్తి మాటలే అని అన్నారు.మనిషికి అన్నింటి కంటే డబ్బే ముఖ్యమని వ్యాఖ్యానించారు.దానిని సద్వినియోగం చేసుకుంటే ఎంతో ఉపయోగముంటుందని అన్నారు.తన యూ ట్యూబ్ ఛానల్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు నాగబాబు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషీ కూడా కచ్చితంగా డబ్బు సంపాదించాల్సిందే అన్నారు.నేను డబ్బు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి.నాకు 49వ సంవత్సరంలో ఆ డబ్బు విలువ తెలిసొచ్చింది.అప్పటి వరకు నేను డబ్బును దుర్వినియోగం అయితే చేసి ఉండక పోవచ్చు గానీ,డబ్బు సంపాదించాలనే ఆ కసి నాలో వచ్చేది కాదు.ఆ తర్వాత సంపాదించాను.అది వేరే సంగతి.మీరు ఉద్యోగంలో చేరిన నాటి నుంచే డబ్బు సంపాదించడం మొదలు పెట్టండి.
మీరు కచ్చితంగా "ది రిచ్చెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలాన్" పుస్తకం చదవండి.డబ్బు అనేది ఎందుకు సంపాదించాలి.అది మనకు ఎలా ఉపయోగపడుతుందన్న విషయం అందులో మీకు స్పష్టంగా తెలుస్తుంది.మీ సంపాదనలో కనీసం 10 శాతాన్ని పొదుపు చేయండని ఈ పుస్తకం మీకు చెబుతుంది.డబ్బు విలువ తెలిసిన దగ్గరి నుంచి నేను చాలా జాగ్రత్తపడ్డాను.మరియు ఎక్కువ మొత్తంలో పొదుపు చేశాను.ప్రస్తుత రోజుల్లో ఎవరిదగ్గరైతే ఎక్కువ డబ్బుంటుందో వాడే బలవంతుడు’ అని చెప్పుకొచ్చారు నాగబాబు.