14 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు ఉన్న అనంతనపురం జిల్లా ఒకానొక సమయంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న సంగతి విధితమే. అందులో భాగంగానే 2014లో 12 అసెంబ్లీ సహా 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. వైసీపీ మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేసులకు భయపడకుండా, ఆర్థికంగా చితికిపోయినా కార్యకర్తలను కాపాడుకునేందుకు చాలానే కష్టపడ్డారు. అన్నీ భరించారు. గత ఏదేళ్ల కాలంలో అనంత వైసీపీ శ్రేణులు చేసిన పోరాటం ఫలించింది. దాంతో 2014 సీన్ రివర్స్ అయింది. ప్రజలు ఊహించని రీతిలో వైసీపీకి మద్దతు ఇవ్వడంతో అనంతపురంలో మెజార్టీ సీట్లలో గెలిచారు. 12 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లను గెలుపొందారు. జిల్లాలో టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశారు.
అధికారంలోకి వచ్చాం.. తమ కష్టాలు తీరిపోయాయని వైసీపీ నేతలు భావించారు. కానీ, తీరా ఫీల్డ్‌లోకి దిగిన తరువాత కానీ నేతలకు పరిస్థితి అర్ధం కాలేదు. అధికారంలోకి వచ్చినా తమ పనులు కావడం లేదన్న అసంతృప్తి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారులు తమ మాట వినడం లేదని నేతలు వాపోతున్నారు. తాము అధికారంలో ఉన్నామా..? లేక ప్రతిపక్షంలో ఉన్నామా..? అని షాక్‌ల మీద షాక్‌లకు గురవుతున్న పరిస్థితి. జిల్లాకు ఒకే ఒక్క మంత్రి పదవి దక్కింది. కీలక నేతలకు పదవులు రాలేదు. దీంతో అధికారులు తాము చెప్పిన మాట వినడం లేదన్న అసంతృప్తి నేతల్లో కనిపిస్తోంది. కనీసం అధికారుల బదిలీల్లో కూడా తమ మాట వినడం లేదని నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. మొత్తానికి ప్రతిపక్షంలో తమ పనులు కాలేదని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ అధికారం చెలాయించడం లేదని వైసీపీ నేతలు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పనులు చేయకుంటే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడమనే హెచ్చరికలు చేస్తున్నట్టు తెలుస్తుంది.