నిత్యా మేనన్ తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగానే కాకుండా, నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దక్షిణాది భాషా చిత్రాల్లో రాణించి, ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న చిత్రం "మిషన్ మంగళ్". ఈ చిత్రం లో విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిత్యామేనన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెడ్ టాప్, బ్లూ జీన్ ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
అయితే, మరోపక్క సొంత రాష్ట్రం కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయడంపై ఆ రాష్ట్ర వాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దీంతో నిత్యామేనన్ వివరణ ఇచ్చుకున్నారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఈమేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. "బుద్ధిలేని వారు చేస్తున్న ఆరోపణలపై ఇది నా స్పందన. గత కొన్ని రోజులుగా కేరళ వరదల గురించి నేను ఏమీ మాట్లాడటం లేదని, సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు.
అలాంటి వ్యాఖ్యలకు సాధారణంగా నేను స్పందించను. అలా ఎందుకు మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అయితే నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేద్దామనుకున్నా. అయితే, కేవలం కొన్ని విషయాలను మాత్రమే సోషల్‌మీడియాలో పంచుకుంటా. ఎవరో ఏదో అన్నారని నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే, మీరు సంతోష పడతారు. ఆ తర్వాత మర్చిపోతారు. కానీ, అది కాదు చేయాల్సింది. ఇక ప్రస్తుతం పరిస్థితి ఏంటో నాకు తెలుసు. మేమంతా అందుకోసం కలిసి సాయం చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం మీకు తెలియదు. కానీ, నేను సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నారు. ఒక సినిమా ఒప్పుకొన్న తర్వాత ఆ చిత్ర ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనడం నా విధి''.
''డబ్బుల కోసమే ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నానని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా సినిమా విడుదలకు ముందు తప్పకుండా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అందుకోసం ప్రత్యేకంగా ఏమీ చెల్లించరు. నన్ను విమర్శిస్తున్న వారందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. కేరళ వరదల కోసం మీరు ఏం చేశారో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నకు నిజాయతీగా సమాధానం చెబితే, మరొకరిపై మీరు వేలు ఎత్తి చూపించరు. ఎదుటి వారిపై వేలెత్తి చూపే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇతరుల పట్ల గౌరవభావంతో ఉండండి'' అని తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు నిత్యా.