వరల్డ్ కప్ సెమీస్లో భారత్ ఓటమి తరువాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ రిటైర్మెంట్ విషయంలో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొందరు అంటుంటే.. లేదు ఇంకా కొనసాగుతాడని మరికొందరు వాదిస్తున్నారు. ధోని త్వరలోనే క్రికెట్కు గుడ్ బై చెప్తాడనే తెలుస్తోంది. ఈ చర్చ ఇలా ఉండగానే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని తర్వాత ఏం చేస్తాడనే సందేహాలు, ఊహాగానాలు పరిపరివిధాల వ్యక్తమవుతున్నాయి.ధోని సన్నిహితులు మాత్రం ఆయన రాజకీయాల్లోకి వెళ్తాడని,
బీజేపీ కండువా కప్పుకుంటాడని చెప్పుకొస్తున్నారు. తాజాగా ధోనీ తీసుకున్న నిర్ణయం అందరి ఊహాగానాలకు చెక్ పెట్టినట్లైంది. ఇండియన్ ఆర్మీలో చేరాలని ధోని నిర్ణయించుకున్నాడని, రాబోయే రెండు నెలలు పారాచూట్ రెజిమెంట్లో ధోని సేవలందించన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కారణంగానే విండీస్ టూర్కు మహీ దూరంగా ఉంటున్నాడట. అయితే గతంలో తాను క్రికెట్కు దూరమైతే ఆర్మీలోనే చేరుతానని ధోనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధోనీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం.. తన రిటైర్మెంట్పై పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు అంతా భావిస్తున్నారు.