రండి బాబు రండి హోటల్లో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది ఇంకెక్కడా లేనటువంటి అత్యాధునిక ప్రమాణాలతో కాలుష్య రహిత మైన గాలిని హోటల్లో అందిస్తాం అంటూ ఢిల్లీ చుట్టుపక్కల వున్న హోటల్ అన్ని సరికొత్త ఆఫర్లతో పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి.
వాయు కాలుష్యం దెబ్బకు దేశ రాజధాని ప్రజలు గజగజా వణుకుతూ ఉన్న సమయంలో కాలుష్య రహిత గాలిని అందించడానికి హోటల్లో నడుం బిగించాయి. ఇటీవల దిల్లీలో సంభవించిన వాయు కాలుష్య ఉత్పాతం సాధారణ ప్రజల నుంచి వీవీఐపీల వరకూ అందరికీ వణుకు పుట్టించింది. పలు దేశాల రాయబారులు, వివిధ కంపెనీల ప్రతినిధులైతే ఆ నగరం వైపు మేము రాం బాబోయ్ అంటూ అర్జీలు పెట్టేసుకున్నారు.
ఈ పరిస్థితుల్లో తమ మార్కెట్ దెబ్బ తినకుండా ఉండేందుకు అతిథ్య రంగం వినూత్న ఆఫర్లకు తెరలేపింది. కాలుష్య భూతం నుంచి కాపాడతామంటూ పలు హోటళ్లు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. హోటల్ లోపలకు కాలుష్యం చొరబడకుండా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని ఐటీసీ మౌర్య ప్రకటించింది. తాజ్మహల్, తాజ్ డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ వంటి హోటళ్లలో ఉన్న అన్ని గదుల్లోనూ ఐఏక్యూ ప్రమాణాల మేరకు కాలుష్యం చొరబడలేని అధునాతన ఎయిర్ ఫిల్టర్లను అమర్చింది. మొత్తంమీద స్వచ్ఛమైన గాలికోసం ఆరాటపడే రోజులు వచ్చేశాయన్నమాట. పర్యావరణ పరిరక్షణ మర్చిపోతే భవిష్యత్తు రోజులను గాలిని కూడా కొనుక్కోవాల్సిన అటువంటి పరిస్థితి వస్తుంది అనేది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.