సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్న పనికిమాలిన వీడియోలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యోగా గురు బాబా రాందేవ్‌పై ఆరోపణలు చేసినట్లు ఉన్న వీడియో లింక్‌లను వెంటనే తొలగించాలని ఫేస్బుక్ మేనేజ్మెంట్ను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. రాందేవ్తోపాటూ ఆయన సారధ్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌పై రకరకాల ఆరోపణలు, బెదిరింపులూ చేస్తూ ఉన్న వీడియోలను వెంటనే గూగుల్, యూట్యూబ్‌ల నుంచీ తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.
పనికిమాలిన వీడియోల వల్ల తన పరువు, ప్రతిష్ట దెబ్బ తింటున్నాయని ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోలను తొలగించాలని రాందేవ్ ఈమధ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై జనవరి 24న ఢిల్లీ హైకోర్టు ఫేస్బుక్, గూగుల్, యూట్యూబ్ సంస్థలకు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
అభ్యంతరకర వీడియోలను అప్లోడ్ చేసేముందు బాధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ వీడియోలను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లింకులు చేరకుండా గూగుల్, యూట్యూబ్ మేనేజ్మెంట్లు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.ఇది ఒక్క బాబా రాందేవ్ విషయంలోనే కాదు. చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఎదుర్కొంటున్న సమస్యే. రాందేవ్ ప్రేరణతో ఇప్పుడు అలాంటి వారంతా తమ వీడియోలను తొలగించాలంటూ కోర్టుల మెట్లెక్కే అవకాశాలున్నాయి.