ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్ నిధులు అడగడం మానేసి తన పై ఫిర్యాదులు చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటే పార్టీ కూడా అంత ఉత్సాహంగా ఉంటుందని పేరుకొన్నారు. మనం మొదలుపెట్టిన ప్రపంచస్థాయి రాజధాని నేడు వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
తాను ఉచిత ఇసుక ఇస్తే అది మాఫియా అంటూ దుష్ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఇవాళ జగన్ ప్రభుత్వం చేసేది చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. వైకాపా నేతలు స్థాయిని బట్టి ఇసుక లారీలు పంచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై దాడులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు కేసులు పెడితే మనం కోర్టుల్లో ప్రైవేట్ కేసులుపెడదామన్నారు. రాజీ అనే మాట తన జీవితం లో లేదన్నారు. న్యాయం కోసం కలిసి పోరాటం చేద్దామని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.