//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంపీ కన్నుమూత...శోక సంద్రం లో పార్టీ శ్రేణులు ...

Category : national politics

డీఎంకే మాజీ రాజ్యసభ సభ్యురాలు వసంతి స్టాన్లీ ఆదివారం వేకువజాము మృతి చెందారు. ఆమె వయస్సు 56 సంవత్సరాలు. శివగంగ జిల్లా దేవకోటలో జన్మించిన వసంతి రచయితగా, పాత్రికేయురాలిగా, డీఎంకే స్థానిక శాఖల నాయకురాలిగా మంచిపేరు సంపాదించుకున్నారు. 2008లో డీఎంకే తరఫున ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. డీఎంకే మహిళావిభాగం నాయకురాలిగా, ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్ర మైనారిటీల సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంస్థలలోనూ సేవలందించారు. కొద్ది రోజులకు ముందు వసంతి ఉదర సంబంధిత సమస్యలు రావడంతో ఆపరేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వున్నట్టుండి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానిక తేనాంపేటలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి ఆమె పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఆదివారం వేకువజాము ఆమె తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి వసంతి స్టాన్లీ మృతదేహాన్ని రాయపేట లాయిడ్స్‌కాలనీలోని ఆమె నివాసగృహానికి చేర్చారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌- దుర్గ దంపతులు, పార్టీ ప్రముఖులు లాయిడ్స్‌కాలనీకి వెళ్ళి వసంతి స్టాన్లీ మృతదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ విలేఖరులతో మాట్లాడుతూ, వసంతి స్టాన్లీ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. కవయిత్రిగా, డీఎంకే ప్రసంగీకురాలిగా, మహిళా విభాగం నాయకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగడించారని, ఆమె మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్ర్భాంతి చెందానన్నారు. ఆదివారం సాయంత్రం వరకు స్థానిక ప్రజలు, పార్టీ ప్రముఖుల సందర్శన కోసం ఆమె భౌతికకాయాన్ని అక్కడే వుంచారు. ఆదివారం రాత్రి వసంతి స్టాన్లీ మృతదేహాన్ని ఆమె భర్త సొంత ఊరైన తిరునల్వేలికి తీసుకెళ్లారు. సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని ఆమె కుటుంబీకులు తెలిపారు.